నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. రైతు హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల సైకిల్ యాత్రలో భాగంగా ఆయన పాల్గొన్నారు. మొదటి రోజు మండలంలోని పాల్ధా, జాలాల్‌పూర్, లక్ష్మపూర్, గుండారం గ్రామాల మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, లేదంటే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పద్మా రెడ్డి, శంకర్ రెడ్డి, వెల్మ గంగారెడ్డి, హరీశ్ రెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, ఈగ గంగారెడ్డి, ఆనంద్, గంగాధర్ యాదవ్, మధు తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా
బిచ్కుంద: ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను విక్రయించిన వ్యాపారులు, దుకాణదారులపై జరిమానా విధిస్తామని బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ సీమా షెట్కార్, కమిషనర్ జీవన్ అన్నారు. ఈమేరకు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తనిఖీ చేపట్టాలని సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం, బల్దియా అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వ్యాపారులకు కొంత సమయం ఇస్తున్నామని, అప్పటిలోగా ఉన్న స్టాక్‌ను అమ్ముకోవాలని, అందరికి నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వైస్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


