587 స్కూళ్లకు 148 మాత్రమే నమోదు..
ఖలీల్‌వాడి: జిల్లాలో ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు, విద్యార్థుల వార్షిక ట్యూషన్ ఫీజుల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదుకు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వివరాలను తెలపాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గోప్యత వెనక మతలబు ఏమిటో..
ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆన్‌లైన్ లాగిన్‌లో సమస్యల వస్తున్నాయని ఆడిట్ వివరాలు గోప్యంగా ఉంచడం వెనుక మతలబు ఏమిటానే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు, ఇతర ఫీజుల పేరిట తల్లిదండ్రుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నా, వీటికి సంబందించిన వివరాలను అధికారికంగా ఆడిట్ నివేదికలో చూపించలేక యాజమాన్యాలు దాగుడుమూతలు అడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అర్హత కలిగిన టీచర్లకు ఆధికంగా జీతభత్యాలు ఇస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవల్‌లో టీచర్లకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్ని ప్రయివేట్ పాఠశాలల్లో ఆడిట్ పూర్తి చేయలేదు, దీంతో రికార్డుల నమోదులో జాప్యం జరగుతుందనే సాకుతో వివరాలను ఆన్‌లైన్‌లో పొందపర్చడం లేదని తెలుస్తోంది.
పర్యవేక్షణ కరువు..
జిల్లా విద్యాశాఖలో ప్రయివేట్ పాఠశాల ఆడిట్ నివేదికలను ఆన్‌లైన్, ఫీజుల వివరాలను నోటీసు బోర్డు ప్రదర్శించేందుకు ఓ సెక్షన్ అధికారిని నియమించారు. కానీ సదురు అధికారి బడులను పర్యవేక్షించకపోవడంతోనే జాప్యం జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అధికారి నిర్లక్ష్యం కారణంగా ప్రయివేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యపై కలెక్టర్ దృష్టిసారిస్తేనే ప్రయివేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం బయటకు వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయివేట్ పాఠశాలల ఆదాయ, వ్యయాల వివరాల నమోదుపై ప్రత్యేక దృష్టిసారించాం. యాజమాన్యం, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేసి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించాం. ఫీజుల వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం చేశాం. ఆడిట్ నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారంలో పూర్తిచేయాలి లేకుంటే తగు చర్యలు తీసుకుంటాం.
–పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత మూడేళ్ల వార్షిక పరిపాలన నివేదికలతోపాటు ఆడిట్ చేసిన లెక్కల పత్రాలు, ఫీజుల వివరాలు జూలై 30 నాటికి సమర్పించాలని డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీజులు, ఆడి ట్, ఆదాయ లెక్కలు ఐఎస్‌ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్లో అప్లోడ్ చేయడంతోపాటు ఈ–మెయిల్ ఐడీకి పంపించాలి. 2026–27 విద్యాసంవత్సరంలో తరగతుల వారీగా నిర్ణయించిన ఫీజుల వివరాలను పాఠశా ల నోటీసు బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 587 ప్రయివేట్ స్కూళ్లల్లో 148 పాఠశాలలు ఫీజు వివరాలు నమోదు చేశారు.ఇంకా 439 పాఠశాలలు నమోదు చేయాల్సి ఉంది. వార్షిక ఆదాయ, వ్యయాల సమర్పణలో 2023–24, 25, 26 సంవత్సరాలకు సంబంధించి 148 వరకు పాఠశాలలు ఆన్‌లైన్ నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. చా లా స్కూల్స్ నమోదు లో సాంకేతిక లొసుగులు చూపిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి.
ప్రయివేట్ బడుల ఆదాయ–వ్యయాలు, ఫీజుల వివరాలను వెల్లడించని
కొన్ని యాజమాన్యాలు
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు


