● సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్
రుద్రూర్: రైతుల భూములకు స్పష్టమైన హక్కులు, పారదర్శకమైన భూ రికార్డులు అందించే లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి రీ సర్వే చేపడుతోందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. పొతంగల్ మండలం కారేగాంలో మంగళవారం హుమ్నాపూర్ శివారుకు సంబంధించి రీ సర్వేపై గ్రామస్తులు, పట్టాదారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రీ సర్వే వల్ల భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతు తన భూమిపై స్పష్టమైన హక్కులు పొందుతారని అన్నారు. సర్వే ప్రక్రియలో పట్టాదారులు, గ్రామస్తులు భాగస్వాములై అధికారులకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ సందీప్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శేషుకుమార్, మండల సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.


