● అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య
సుభాష్‌నగర్: విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆదివారం నగరంలోని బస్వాగార్డెన్‌లో అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం బస్వా లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ వల్ల శారీరకంగా, మానసికంగా దృఢత్వంగా తయారవుతారని అన్నారు. తైక్వాండో సాధన చేసే పిల్లలు రోజంతా చురుకుగా ఉండటంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారన్నారు. ప్రమోషన్ టెస్ట్‌లో బెల్ట్ సాధించిన క్రీడాకారులు భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మతో కలిసి బస్వా లక్ష్మీనర్సయ్య క్రీడాకారులకు బెల్ట్‌లతోపాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అంతకుముందు వారిని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్‌కుమార్ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కోచ్‌లు గంగాధర్, నాగరాజ్, శివ, వినయ్, హనీషా, నితిన్, క్రీడాకారుల తల్లిదండ్రులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


