యాప్‌లో రూ.215.. వసూలు రూ. 4 వేలపైనే.. | - | Sakshi
Sakshi News home page

యాప్‌లో రూ.215.. వసూలు రూ. 4 వేలపైనే..

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

ఇసుక ఇబ్బంది వాస్తవమే..

ప్రభుత్వం నుంచి రాలేదు..

వర్ని: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నా యి. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆదేశిస్తుంటే.. మరోవైపు నిర్మాణానికి అవసరమైన ఇసుక తెచ్చుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ని మండలంలో 234 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించగా సరైన సమయంలో ఇసుక రాక నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇసుక కోసం తయారుచేసిన యాప్‌లో బుక్‌ చేసినా సమయానికి రాకపోవడంతో సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి కా వడం లేదు. యాప్‌లో ఇసుక బుక్‌ చేసిన పది రోజుల తర్వాత కానీ లబ్ధిదారుడి ఇంటికి చేరడం లేదు.

ట్రాక్టర్‌ యజమానుల దోపిడీ..

ఇందిరమ్మ లబ్ధిదారుడు ప్రభుత్వ యాప్‌లో ఇసుక బుక్‌ చేసిన తర్వాత సొంత ట్రాక్టర్‌తో తెచ్చుకునేందుకు వెళితే మంజీరా పరీవాహక ప్రాంత ట్రాక్టర్‌ యజమానులు అడ్డుపడుతున్నారు. తమ ట్రాక్టర్ల ద్వారానే తరలించుకోవాలని, లేకపోతే ఇసుక తీసుకుపోవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ యాప్‌లో రూ.215 చెల్లించి ఇసుక బుక్‌ చేసినా వర్ని మండలానికి వచ్చేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ట్రాక్టర్‌ యజమానులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు 10 ట్రాక్టర్ల ఇసుక బుక్‌ చేస్తే ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక పంపి, రెండు ట్రాక్టర్లు ఇసుకను ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారుడే నేరుగా ఇసుక తెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

బిల్లుల కోసం..

వర్ని మండలానికి మొత్తం 512 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 210 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. అయితే, 33 ఇళ్లకు మాత్రమే పూర్తి బిల్లులు చెల్లించగా, 168 మంది ఇళ్లకు ఇంకా ఫైనల్‌ బిల్లులు రాలేదు. బిల్లులు త్వరగా వచ్చేలా చూడాల ని లబ్ధిదారులు కోరుతున్నారు.

మంజీరా ప్రాంత ట్రాక్టర్‌ యజమానుల బెదిరింపులతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుక లేక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. లబ్ధిదారులు యాప్‌లో ఇసుక బుక్‌ చేస్తే మంజీరా నుంచి తెచ్చుకోవడానికి ఆ ప్రాంత ట్రాక్టర్‌ యజమానులు అడ్డుపడుతున్నారు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లాం. – వెంకటేశ్వర్‌, ఎంపీడీవో, వర్ని

ఇళ్లు పూర్తయిన కొందరికి ఫైనల్‌ బిల్లులు ప్రభుత్వం నుంచి రాలేదు. రాగానే చెల్లిస్తాం. ఇల్లు ప్రారంభించిన వారు పని జరిగిన విధానాన్ని యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయగానే బిల్లులు చెల్లిస్తున్నాం. – అశోక్‌, హౌసింగ్‌ ఏఈ

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తిప్పలు

లబ్ధిదారులను ఇబ్బందిపెడుతున్న

ట్రాక్టర్‌ యజమానులు

సొంత వాహనాల్లో తెచ్చుకునేందుకు అడ్డంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement