సుభాష్‌నగర్: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ అవుట్ సోర్సింగ్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టీజీపీఈ జేఏసీ చైర్మన్ రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఈ జేఏసీ అత్యవసర నిరసన పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. వైటీపీఎస్‌లో సీహెచ్‌పీ, ఏహెచ్‌పీ అవుట్‌సోర్సింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఉద్యోగుల భవిష్యత్, సంస్థ మనుగడకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ వద్దు.. ఉద్యోగ భద్రత ముద్దు అని పేర్కొన్నారు. పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, ఆర్జిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైటీపీఎస్ ప్రయివేటీకరణ చర్యను జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని, ఉద్యోగుల పోరాటానికి టీజీపీఈ జేఏసీ సంఘీభావం ప్రకటించిందన్నారు. జేఏసీ నాయకులు, జనరల్ సెక్రటరీ పి గంగాధర్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, గంగారాం నాయక్, కాశీనాథ్, శ్రీధర్, రాజేందర్, చెన్నయ్య, పి రాజు నాయక్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.


