● లేట్ ఖరీఫ్‌కు అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలి
● రైతులకు డీఏవో వీరాస్వామి సూచన
పెర్కిట్(ఆర్మూర్): ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామి రైతులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. ఆలస్యంగా వర్షాలు వచ్చిన పక్షంలో లేట్ ఖరీఫ్‌కు అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల్లో తేమ సంరక్షణ, నీటి పొదుపు, మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను అనుసరించడం ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించుకోవచ్చన్నారు. ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని, సమతుల్య ఎరువుల వినియోగం, పంటలపై చీడపీడలు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ శాసీ్త్రయ పద్ధతుల్లో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, ఏవో హరికృష్ణ, హెచ్‌వో సంధ్య, సొసైటీ చైర్మన్‌లు సోమ హేమంత్‌రెడ్డి, మహిపాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఏఈవోలు పాల్గొన్నారు.


