సెల్‌ టవర్‌ కేబుల్‌ చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ కేబుల్‌ చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

కామారెడ్డి టౌన్‌: సెల్‌ టవర్‌ కేబుల్‌ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌ బుధవారం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 18న రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్‌ వైర్లను దొంగిలించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జూనియర్‌ టెలికాం అధికారి నల్లవెల్లి శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రామారెడ్డిలో జగదాంబ తండా జంక్షన్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా వస్తున్న టాటా ఎస్‌ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. వాహనంలో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి యత్నించగా పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ కేబుల్‌ వైర్లు చోరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో రామారెడ్డి మండలం ఇసాయిపేట్‌కు చెందిన పుప్పాల కిరణ్‌ కుమార్‌తో పాటు మెదక్‌ జిల్లాకు చెందిన కల్లెం సతీశ్‌, పార్టం గాబ్రియల్‌, గంగారాం ఉన్నారు. నిందితుల నుంచి చోరీకి గురైన కేబుల్‌ వైర్‌ తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలు, విధ్వంసక చర్యలు, గ్రామాల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీఐ శ్రీధర్‌గౌడ్‌, రామారెడ్డి ఎస్సై మురళీ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement