బాలలపై బ్యాగుల భారం | - | Sakshi
Sakshi News home page

బాలలపై బ్యాగుల భారం

Jul 23 2026 1:54 AM | Updated on Jul 23 2026 1:54 AM

వయసుకు తగ్గ బరువు మోయాలి

వయసుకు మించి బరువును

మోస్తున్న చిన్నారులు

కందిపోతున్న చిన్ని భుజాలు

అమలు కాని ప్రభుత్వ నిబంధనలు

ఖలీల్‌వాడి: చిన్నారులకు బడి బ్యాగులు భారమవుతున్నాయి. తమ వయస్సుకు మించి అధిక బరువు ఉన్న బ్యాగులను మోయలేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులపై పుస్తకాల భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు బ్యాగుల బరువుపై మార్గదర్శకలను రూపొందించాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ–2020)లోనూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఒక్కో స్కూల్‌లో ఒక్కో విధంగా..

జిల్లాలోని ఒక్కొక్క ప్రయివేట్‌ స్కూళ్లల్లో ఒక్కోవిధంగా పుస్తకాలు, నోట్‌బుక్స్‌ ఇస్తున్నాయి. కొన్ని పాఠశాల్లో ఒక సబ్జెక్ట్‌కు ఒక నోట్‌బుక్‌ ఉండేది, కానీ దీనికి రఫ్‌బుక్‌, నోట్‌బుక్‌, పరీక్ష నోట్‌బుక్‌, వర్క్‌బుక్‌, అసైన్మెంట్‌ బుక్‌, ప్రాక్టీస్‌ బుక్‌ వంటివి పెడుతున్నారు. దీంతో విద్యార్థులకు బ్యాగు బరువు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఒక సబ్జెక్ట్‌కు ఐదు నుంచి ఆరు పుస్తకాలు ఉంటున్నాయి. ఒకప్పుడు పదో తరగతి వరకు కూడా ఆరు నోట్‌ బుక్స్‌, ఆరు టెక్ట్స్‌బుక్‌, నోట్‌ బుక్స్‌ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రైవేట్‌లో ఎల్‌కేజీ విద్యార్థికి కనీసం పది పుస్తకాలు, అదనంగా నోట్‌ బుక్స్‌ ఉంటున్నాయి.

శరీర బరువులో 10 శాతం మించొద్దు..

కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం స్కూల్‌ బ్యాగ్‌ విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని స్పష్టంగా పేర్కొంది. ప్రతి రోజు పాఠశాల్లో టైంటేబుల్‌ ప్రకారం పుస్తకాలను విద్యార్థులు తీసుకువెళ్లాలని నిబంధన ఉంది. విద్యార్థులకు లాకర్‌ సౌకర్యం కల్పించడం, డిజిటల్‌ లెర్నింగ్‌ను ప్రోత్సహించడం, హోంవర్క్‌ పరిమితం చేయడం వంటి సూచనలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవడంతో విద్యాసంస్థలు ఎక్కువ సంఖ్యలో పుస్తకాలను అంటగట్టి అందినకాడికి దోచుకుంటున్నాయి. విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తే బ్యాగు బరువు తెలుస్తుందని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు. పుస్తకాల భారం తగ్గినప్పుడే పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా..

తరగతి పుస్తకాల బరువు(కేజీల్లో)

1, 2 1–2

3, 4, 5 2–3

6, 7 4

8 4–5

9, 10 5

చిన్నారులు వయస్సుకు తగ్గ బరువు మాత్రమే మోయా లి. బాల్యంలోనే ఎల్‌కేజీ స్టూ డెంట్‌కు పుస్తకాలు అధికంగా ఇవ్వడంతో వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతుంది. బరువైన బ్యాగు మోయడంతో మెడ, భుజం, నడుము నొప్పి వంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే పిల్లలు తొందరగా అలసిపోతారు. చదువుపై దృష్టిపెట్టలేకపోతారు.

–రాందాస్‌, ఎంఎస్సీ(ఆర్థో), నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement