లింగంపేట: లింగంపేట మండలం పర్మళ్ల జీపీ పరిధిలోని అటవీ భూమిలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల ఉపాధి హామీ పథకం నిధులతో ఎనిమిది ఎకరాల్లో సుమారు వెయ్యి మొక్కలు నాటారు. ఇందు కోసం వారం రోజులు శ్రమించి గుంతలు తవ్వించారు. మండల ప్రత్యేకాధికారి, జడ్పీ డిప్యూటీ సీఈవో సురేందర్, సర్పంచ్ బాబాయి నరేశ్, క్షేత్రసహయకుడు లక్ష్మణ్, కార్యదర్శి నరేశ్, గ్రామస్తులు కలిసి ఈ నెల 14వ తేదీన మొక్కలు నాటారు. నాటిన మూడు రోజులకే సుమారు 350 మొక్కలను కొందరు ట్రాక్టర్‌తో రాత్రివేళ ధ్వంసం చేశారు. కొందరు వ్యక్తులు అటవీ భూమిని ఆక్రమించుకోడానికే ఈ చర్యలకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్ రూరల్: సువర్ణ అధ్యాయన పుస్తక పరిచయ కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్‌సీఆర్‌టీ రిటైర్డ్ బాధ్యుడు సువర్ణ వినాయక్ హాజరై మాట్లాడారు. ఎస్‌సీఆర్టీలో ఆయన నాలుగు దశాబ్దాలుగా అందించిన విద్యారంగ సేవలను కొనియాడారు. బుక్ రచయిత, డీఆర్పీ గంట్యాల ప్రసాద్‌ను పలువురు రచయితలు సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి శారద హనుమాన్లు, నాయకులు వినోద్, కిషన్, రమణాచారి, హెచ్‌ఎం ఇందూర్ బాబు, శ్రీనివాస్, గోపాలకృష్ణ, సేనాపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బోధన్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీఫారం గ్రామంలో శనివారం రాత్రి రాకం స్వప్న(44) అనే వివాహిత కొంత కాలంగా గుండెనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


