క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

May 30 2026 8:29 AM | Updated on May 30 2026 8:29 AM

గుర్తుతెలియని వృద్ధురాలు మృతి ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు

కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి

మాక్లూర్‌ : కొబ్బరి బొండాలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన మాక్లూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్ర వారం చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్‌ కథనం ప్రకా రం.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన జంపయ్య(52)ను జన్నేపల్లి క్రాసింగ్‌లో కొబ్బరి బొండాల వ్యాపారం చేసే అబ్బూరి చిరంజీవి బొండాలు కొయ్యడానికి కూలీ ప్రాతిపదికన కొత్తపల్లి తీసుకెళ్లాడు. అక్కడ కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డ జంపయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జంపయ్య మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్‌ పరిధిలో ఉన్న లక్ష్మమ్మ గుడి వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు (68) మృతి చెందింది. శుక్రవారం రాత్రి గుడి వద్ద వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్‌ గంట మధు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతి చెందింది ఎవరనేది తెలియకపోవడంతో, కౌన్సిలర్‌ మధు దగ్గరుండి అంబులెన్స్‌ను పిలిపించారు. పోలీసుల సూచనల మేరకు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే జిల్లా ఆస్పత్రి అధికారులు, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : నగరంలోని సాయినగర్‌–2 కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పుట్ట రాజశేఖర్‌(46) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

నిజామాబాద్‌ అర్బన్‌ : వినాయక్‌నగర్‌లోని కల్లుబట్టిలో ఇటీవల జరిగిన ఓ ఘర్షణలో వ్యక్తిని హత్యచేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వీరిని రిమాండ్‌ చేయనున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement