జిల్లా పశుసంవర్ధక శాఖ సూచనలు
డొంకేశ్వర్ (ఆర్మూర్) : తీవ్రమైన ఎండలతోపాటు వడగాలుల ప్రభావంతో మనకే కాదు మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనుషులకు ఎండదెబ్బ తగులుతోంది. అలాంటిది బయట మేతకోసం సంచరించే పశువులు, గొర్రెలు, మేకలతోపాటు పక్షులు ఎంత అల్లాడుతున్నాయో చెప్పనక్కర్లేదు. మండుతున్న ఎండల బారి నుంచి మూగజీవాలను ఏ విధంగా కాపాడుకోవాలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ‘సాక్షి’కి వివరించారు.
● గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులను ఎక్కువగా తిప్పకూడదు. వీలైనంత వరకు చల్లని ప్రాంతాల్లో, నీడపట్టున ఉంచాలి. ఇంటి వద్ద రేకుల షెడ్డు ఉన్న వారు పైన వరిగడ్డి ఉంచితే వేడి ప్రభావం తగ్గుతుంది. వీలైతే ఫ్యాన్‌లు కూడా పెట్టాలి.
● మేతను ఎక్కువగా ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. బయటకు తీసుకెళ్లడం తప్పనిసరైతే, ఉదయం 6 నుంచి 10 గంటల్లోపు తీసుకెళ్లాలి. మళ్లీ సాయంత్రం 5 దాటిన తర్వాత మరోసారి మేతకు తీసుకెళ్లాలి.
● వేసవిలో పశువులు ఎక్కువ మోతాదులో నీటిని తాగుతాయి. వాటికి సరిపడా చల్లని, శుభ్రమైన నీటిని అందించాలి. ఒక్కో గేదె 50 లీటర్ల నీళ్లు తాగేలా చూడాలి. మేత, దానా పచ్చి రూపంలో అందిస్తే బాగుంటుంది.
● ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎల్లప్పుడూ నీడ పట్టున ఉంచి క్రమం తప్పకుండా ఆహారం, నీటిని అందించాలి. పక్షుల కోసం ఇంటి బయట గిన్నెలు, పాత్రల్లో నీటిని పోసి ఉంచాలి.
● పశువులు, గొర్రెలు, మేకలు, పెంపుడు కుక్కలు ఎండ ప్రభావానికి, ఎండదెబ్బకు గురైతే వాటి శరీరం వేడిగా, పొడిబారి ఉంటుంది. వెంటనే తడిబట్టతో తుడవాలి, లేదా కప్పి ఉంచాలి. ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే స్థానిక పశువైద్య అధికారులకు సమాచారం అందించాలి.


