● మూడునాలుగు నెలలకోసారి విడుదల
● ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆపరేటర్లు
● ప్రతి నెలా చెల్లించాలని వినతి
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీల పరిధి లో చేపట్టే ఎన్నో రకాల పనులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే కంప్యూటర్ ఆపరేటర్లకు సరిగా వేతనాలు అందడం లేదు. మండలానికి ఇద్దరు, ముగ్గురు చొప్పు న కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత ప్రభుత్వం నియమించింది. జిల్లాలో ఉన్న 545 గ్రామ పంచాయతీలకు 84 మంది కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రభు త్వం టీఎస్‌బీపాస్ ద్వారా ప్రతి నెలా వేతనాలను జమ చేయాల్సి ఉంది. అయితే మూడు, నాలుగు నె లలకోసారి వేతనాలు చెల్లిస్తుండటంతో ఆపరేటర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు నాలుగు నెలల వేతనం జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం వారం రోజుల కింద మూడు నెలల వేతనాలను నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తున్నట్లుగానే తమకుసైతం ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు.


