సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి వద్ద, జానకంపేట గూడ్స్ షెడ్ వద్ద ఆర్‌వో బీలను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5న భారత ప్రభుత్వం ఆర్‌వోబీల కోసం భూసేకరణ చేసేందుకు ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. వీటిని స్పెషల్ ప్రాజెక్టులుగా గుర్తించి కేంద్రం గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్టు’ కింద సికింద్రాబాద్–ముథ్కేడ్ సెక్షన్ పరిధిలోని ఈ రెండు చోట్ల ఆర్‌వోబీల నిర్మాణాలు చేయనున్నారు. ఇందుకోసం రైల్వే చట్టం–1989లోని సెక్షన్ 2, క్లాజ్ (37ఏ) ప్రకారం ఉన్న అధికారాలను వినియోగిస్తూ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టులను జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌లో పేర్కొనడం విశేషం. ఈ ఆర్‌వోబీల నిర్మాణాల కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుసార్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను, రైల్వే ఉన్నతాధికారులను కలిసి అనేక విజ్ఞప్తులు చేశారు. కాగా ఆర్‌వోబీలతో ఈ ప్రాంతాల్లో ప్రయాణికుల సమస్యలు తీరనున్నాయి. ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడడంపై ఈ ప్రాంతాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పార్లమెంట్ పరిధిలో 10 ఆర్‌వోబీలు లక్ష్యం : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 10 ఆర్‌వోబీలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నాం. వీటితో ప్రాంతాల మధ్య మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా మరింత అభివృద్ధికి ఊతం ఇస్తుంది. ప్రజల ప్రాణానికి రక్షణ, ట్రాఫిక్ సమస్యలు తొలగుతాయి. ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఆర్‌వోబీలు నిర్మాణం చేయించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాం.
ఇక అమృత్ భారత్ కింద రూ.53 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు అందించే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. కాగా నిజామాబాద్ మీదుగా నడిచే పలు రైళ్లను స్పెషల్ రైళ్ల నుంచి రెగ్యులర్ రైళ్లుగా మార్చడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగింది. జిల్లాకు రవాణా పరంగా మరింత బలం చేకూరింది. ప్రజల అవసరాలను గుర్తించి ఈ ప్రాజెక్టులను ‘స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్’ కింద చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ధన్యవాదాలు. తాజా గెజిట్‌తో తక్షణమే భూసేకరణ చేపట్టే అవకాశం కలిగింది. పరిపాలన అనుమతులు వేగంగా లభిస్తాయి. టెండర్ల ప్రక్రియ, కేంద్ర నిధుల సమీకరణ సులభమవుతుంది. ముఖ్యంగా ప్రజల భద్రత పెరిగి రైలు–వాహన ప్రమాదాలు తగ్గుతాయి.
ఇందల్వాయి, జానకంపేట
గూడ్స్ షెడ్ వద్ద నిర్మించనున్న రైల్వే శాఖ
భూసేకరణ కోసం గెజిట్ విడుదల
చేసిన భారత ప్రభుత్వం
ఇప్పటికే రూ.53 కోట్లతో
నిజామాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు


