వర్ని: జూన్ నాటికి జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా రైతులకు సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం జాకోరా, చందూర్ మండలం చందూర్, మోస్రా మండలం చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ల ట్రయల్ రన్‌ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. నిజాంసాగర్ ఎగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందించేందుకుగాను లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ నెల ఆఖరులో ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో లిఫ్ట్ ఇరిగేషన్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎత్తిపోతల పథకం సలహాదారులు చంద్రారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, జాకోరా సర్పంచ్ సాయిలు, నాయకులు భారీ, గిరి పాల్గొన్నారు.


