సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్(ఎన్‌పీఎల్) పోటీల వివరాలను సీపీ వివరించారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉంచేందుకు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ సెక్యూరిటీ పై పూర్తి అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తు న్నామన్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ కన్వీనర్‌గా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కవితారెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో క్రీడాపోటీలు జరుగుతాయన్నారు. క్రీడల విభాగం జాయింట్ సెక్రెటరీ కేసరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలను పర్యవేక్షించేందుకు డాక్టర్ శిరీష్‌కుమార్, కాకతీయ విద్యాసంస్థల ప్రతినిధి రజినీకాంత్ పనిచేస్తారన్నారు. ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ పోటీలు ఉంటాయన్నారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో జరుగుతాయన్నారు. ప్రథమ విజేతకు రూ.20 వేలు, ద్వితీయ విజేతకు రూ.10 వేలు, తృతీయ విజేతకు రూ.5 వేలు బహుమతిగా అందిస్తామన్నారు. అయితే, కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే ఉంటాయన్నారు.
● యోగా పోటీలు సుభాష్‌నగర్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు. అండర్–14, అండర్–18 పైబడిన బాలబాలికలకు ఆరు కేటగిరీల్లో 18 బహుమతులు ఉంటాయన్నారు. మొదటి విజేతకు రూ.3 వేలు, రెండో విజేతకు రూ.2 వేలు, మూడో విజేతకు రూ.వెయ్యి బహుమతి ఉంటుందన్నారు.
● క్రికెట్ పోటీలు కంఠేశ్వర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్‌లో హార్డ్ టె న్నిస్ బాల్‌తో నిర్వహిస్తామన్నారు. ఎంట్రీ ఫీజు రూ.5 వేలు ఉంటుందన్నారు. విజేతలకు రూ.లక్ష, రన్నరప్‌కు రూ.50 వేలు బహుమతి ఇస్తామన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 11 నుంచి 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 18న పోటీల కు సంబంధించి డ్రా తీస్తామని తెలిపారు. పోటీలు జిల్లా వాసులకు మాత్రమేనన్నారు. టోర్నీ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్‌కుమార్ (97011 77144), కబడ్డీ కోచ్ ప్రశాంత్ ఉంటారన్నారు. మల్లేశ్ గౌడ్ (వాలీబాల్) 94407 11635, నరేశ్ (బాస్కెట్‌బాల్) 94404 04424, ప్రశాంత్ (కబడ్డీ) 98667 70889, సంగీత (యోగా) 98484 20803, గంగాధర్ (యోగా) 80749 82200, సురేశ్ కుమార్(క్రికెట్) 98492 02586, విక్రమ్(క్రికెట్) 94933 09972 ఉంటారన్నారు. ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
‘నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఆధ్వర్యంలో ఎన్‌పీఎల్
వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ పోటీల నిర్వహణ
పోలీస్ కమిషనర్, నిజామాబాద్
సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ సాయిచైతన్య


