● సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో భేటీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ప్రజలను చైతన్యపర్చాలని సూచన
నిజామాబాద్‌అర్బన్: ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమవంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రజలకు విస్తృతస్థాయిలో సమాచారం చేరడానికి సామాజిక మాధ్యమాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా సంక్షేమ పథకాల అమలులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేపట్టనున్న కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు, సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఇంటర్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం కూడా అమలు కానుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఉద్దేశించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని తమదైన శైలిలో ప్రజలకు చేరవేయాలని, దీంతో ప్రమాదాల నియంత్రణకు దోహదపడినవారు అవుతారని అన్నారు. ఈ నెల 13న గ్రామ పంచాయతీల్లో జరిగే గ్రామసభలతోపాటు 16న జరిగే మండల స్థాయి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సభలలో పాల్గొని ప్రజలను చైతన్యపర్చాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వాములయ్యే సామాజిక మాధ్యమకర్తలకు జిల్లా యంత్రాంగం తరఫున తప్పనిసరిగా తగిన గుర్తింపునిస్తామని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, డీఈవో అశోక్, డీఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, డీపీఆర్‌వో పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


