యువత ఆరోగ్యం మా బాధ్యత..
మార్పు కోసమే ఈ ప్రయత్నం..
మోర్తాడ్(బాల్కొండ):గ్రామీణ యువత మత్తు ప దార్థాలకు అలవాటు పడుతుండటంతో గ్రామ పంచాయతీలు తీర్మానాలతో కట్టడికి చర్యలు చేపట్టా యి. ఇటీవల కొన్ని గ్రామాల్లో మత్తు పదార్థాలు వి క్రయించినా,వినియోగించిన జరిమానాలను విధిస్తామంటూ జీపీ పాలకవర్గాలు తీర్మాణాలు చేశా యి. దీంతో ఆయా గ్రామాలను చూసి చుట్టుపక్కల గ్రామాల్లోనూ అలాంటి తీర్మాణాలు చేస్తుండటంతో పలువురు వారి నిర్ణయాలను అభినందిస్తున్నారు.
యువతను సన్మార్గంలో నడిపించేలా..
పుస్తకాలతో కుస్తీ పట్టే వయస్సులో సిగరేట్లు, గుట్కాలు ఇతర మత్తు పదార్థాల అలవాట్లతో యువత తమ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటోంది. దీంతో ఆ మత్తు వదిలించేలా గ్రామ పంచాయతీలు ఆదర్శవంతమైన తీర్మానాలతో కట్టడి చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. గ్రామ పంచాయతీ అంటే గ్రామంలో పరిశుభ్రత, నీటి వసతి కల్పించడం ఇతర సౌకర్యాలను మెరుగుపరచడమే కాదు. యువతను సన్మార్గంలో నడిపించేలా మంచి తీర్మానాలను చేస్తున్నాయి. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామ పంచాయతీ ఇటీవల ఒక తీర్మానం చేసింది. వ్యాపారులు ఎవరైనా 18 ఏళ్ల వయస్సు నిండనివారికి సిగరేట్లు, గుట్కలను విక్రయిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే వేల్పూర్ గ్రామ పంచాయతీ ఒక అడుగు ముందుకు వేసి గంజాయి అమ్మినా, సేవించినా, వారి సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల బహుమతిని ప్రకటించారు. వ్యాపారులు మైనర్‌లకు సిగరేట్లు, గుట్కాలు, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే రూ.10వేల జరిమానా వసూలు చేస్తామని హెచ్చరిస్తూ తీర్మానం చేశారు. గంజాయి విషయంలో సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పష్టం చేయడం గమనార్హం. అలాగే చిన్నారుల ఆరోగ్యం దృష్ట్య ఐస్‌క్రీం బండ్లకు సైతం గ్రామంలో ప్రవేశం నిషేధించారు. ఒకవేళ ఎవరైనా ఐస్‌క్రీమ్‌లు విక్రయించినా రూ.5వేల జరిమానా అని తీర్మానించారు. యువత ఆరోగ్యం విషయంలో ఈ రెండు గ్రామ పంచాయతీలు చేసిన తీర్మాణాలను ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రతి గ్రామంలో యువతను మత్తుకు దూరంగా ఉంచితే మంచి భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యువత ఆరోగ్యం కాపాడటం మా బాధ్యత అనుకున్నాం. సిగరేట్లు, గుట్కాలకు అలవా టు కాకుండా కాపాడగలిగితే యువత చెడుమార్గంలో పయనించదు. వ్యాపారులు కూడా గ్రామ పంచాయతీ తీర్మానానికి సహకారం అందించాలి. – బెజ్జారపు పావని, సర్పంచ్, తాళ్లరాంపూర్
యువతలో మార్పు తీసుకరావడం కోసం చిన్న ప్రయత్నం చేశాం. మా తీర్మానంను గ్రామస్తులు అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మంది మాకు ఫోన్‌లు చేసి అభినందిస్తున్నారు.
– మొండి అశోక్, సర్పంచ్, వేల్పూర్
18 ఏళ్లలోపు వారికి పొగాకు,
మత్తు పదార్థాలు విక్రయించవద్దని
పలు గ్రామాల్లో హెచ్చరికలు
ఎవరైనా అమ్మినా, కొన్నా జరిమానా
విధిస్తామంటూ ప్రకటన


