బీఎస్పీ నిజామాబాద్ పార్లమెంట్
ఇన్‌చార్జిగా నీరడి లక్ష్మణ్
నిజామాబాద్ రూరల్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పార్లమెంట్ ఇన్‌చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్‌ను నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు ముఖ్య సెక్టార్ ప్రభారి అతార్ సింగ్ రావు , మరొక ముఖ్య సెక్టార్ ప్రభారి సురేష్ ఆర్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్‌ల సూచనల మేరకు నిజామాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ బుధవారం నియమించారు. పార్టీ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు.
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
నిజామాబాద్ రూరల్: నగరంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన అర్జన్ ఈనెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.శ్రీలక్ష్మీచేయూత సే వా సమితి వారు విరాళాలు సేకరించి రూ.12,000 నగదు, రూ.3,000 కిరాణ సామగ్రిని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు బంగారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు లక్ష్మన్, శ్రీనివాస్, యాదగిరి, రవీందర్‌లు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
సిరికొండ : మండలంలోని గడుకోలుకి చెందిన నిమ్మ రాజుల చిన్న ఎడ్డన్నకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును బీజెపీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతకుంట రామస్వామి బుధవారం అందజేశారు.అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సహకారంతో లక్షా ఇరవై అయిదు వేల చెక్కు మంజూరైందని ఆయన తెలిపారు.
దివ్యాంగుల క్షేమం కోసం పడిపూజ
రెంజల్(బోధన్): దివ్యాంగుల క్షేమం కోరుతు స్నేహ సొసైటీ వ్యవస్థాపకుడు సిద్దయ్య పడిపూజ, హనుమాన్ స్వాములకు నీలా క్యాంపులో బుధవారం మండల భిక్షను ఏర్పాటు చేశారు. స్వాముల ఆశీర్వాదంతో శారీరక, మానసిక దివ్యాంగులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఐదేళ్లుగా ఆయన హనుమాన్ స్వాములకు మండల బిక్షను ఏర్పాటు చేస్తున్నారు. పలువురు గురుస్వాములు ఆశీర్వదించారు.


