● బంగారు ఆభరణాలు అపహరణ ● నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లిలో వృద్ధురాలైన అత్తను కోడలు హత్య చేసి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలను అపహరించింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. సీతాయిపల్లి గ్రామానికి చెందిన కావటి రుక్మవ్వ(73)కు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉండగా, వారికి వివాహాలు జరిగాయి. కొన్నేళ్ల క్రితం మొదటి ఇద్దరు కొడుకులు మృతిచెందగా, చిన్న కుమారుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. గ్రామంలో రుక్మవ్వ, మొదటి ఇద్దరు కోడళ్లు వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. రుక్మవ్వకు కొన్నిరోజులుగా రెండో కోడలు కోటవ్వతో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అత్తపై రెండో కోడలు రాయితో బలంగా కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మెడలోని బంగారు గుండ్లు, చెవి కమ్మలను కోటవ్వ అపహరించింది. అనంతరం సహజ మరణంగా బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, తలకు గాయం ఉన్నట్లు బంధువులు గుర్తించి, కోటవ్వను నిలదీశారు. తానే హత్య చేసినట్లు ఆమె ఒప్పుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. మృతురాలి కుమార్తె కిష్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని, అపహరించిన ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోపాల్: ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన మోపాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గన్నారం గ్రామానికి చెందిన తెడ్డు సురేష్ ఆదివారం నిజామాబాద్ బస్టాండ్‌కు వచ్చాడు. నర్సింగ్‌పల్లిలోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు చద్మల్ వైపు వెళ్తున్న బస్సు ఎక్కాడు. నర్సింగ్‌పల్లి శివారులోకి బస్సు రాగానే ఆపాలని అతడు గొడవకు దిగాడు. బస్టాప్ దగ్గరే ఉంది.. అక్కడే ఆపుతానని కండక్టర్ చెప్పినా విన్పించుకోలేదు. సురేష్‌తో వచ్చిన మరో వ్యక్తి నడిపి బాబయ్య కండక్టర్, డ్రైవర్‌ను దూషిస్తూ బస్సును అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో అప్పటికే కోపోద్రిక్తుడైన సురేష్ బస్సు ఆగిన వెంటనే కర్రతో కండక్టర్‌ను చితకబాదాడు. దీంతో కండక్టర్ హన్మంతు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు.


