సుభాష్‌నగర్: దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, వారికి ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం వారిని అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్‌తో కలిసి గన్‌పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ధన్‌పాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్ రూ.6వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.


