మహిళల ఆర్థిక పురోగతే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
బోధన్‌టౌన్(బోధన్): మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా, కోటి మందిని కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని లయన్స్ కంటి ఆస్పత్రి మీటింగ్ హాల్‌లో సోమవారం వడ్డీలేని రుణాల రాయితీ చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా 690 మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాల రాయితీ చెక్కు రూ. 1 కోటి 99 లక్షలను సభ్యులకు అందజేశారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వడ్డీలేని రుణాల కింద నిధులను కేటాయించిందన్నారు. ప్రభుత్వ అందించే బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలతో వ్యాపారం నిర్వహించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్‌లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ యూనిఫాం స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి వంటి క్యాంటిన్లు మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. మహిళల గౌరవం మరింత పెంచేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలను అమలు చేస్తుందని, రుణాలతోపాటు మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, డీఆర్‌డీవో సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, నాయకులు, పట్టణ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


