ఎండిన, శుభ్రం చేసిన పసుపును తీసుకురావాలి
● పచ్చి పసుపు అమ్మకాలు పూర్తిగా నిషేధం
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి
● పసుపు ప్రచార రథాలు ప్రారంభం
సుభాష్‌నగర్: ఎండిన, శుభ్రం చేసిన పసుపును నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి రైతులకు సూచించారు. పసుపు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కెట్‌కు పసుపు తీసుకొచ్చే రైతులను చైతన్యపర్చేందుకు ప్రచార రథాలను సోమవారం ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో పచ్చి పసుపు అమ్మకాలను పూర్తిగా నిషేధించిన విషయాన్ని గుర్తెరగాలని రైతులకు సూచించారు. ఏఎంసీ సిబ్బందితో ఏర్పాటైన కమిటీలు రైతులను చైతన్యపర్చి, అవగాహన కల్పించేందుకు వాల్‌పోస్టర్లు, కరపత్రాలతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గ్రామగ్రామానా ప్రచారం చేస్తాయన్నారు. రైతులంతా ఒకేసారి పసుపు తీసుకురాకుండా విడతల వారీగా తీసుకొస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు మార్కెట్ కమిటీకి సహకరించాలని చైర్మన్ ముప్ప గంగారెడ్డి కోరారు. పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, నాయకులు బాగారెడ్డి, వైస్ చైర్మన్ రాంచందర్, డైరెక్టర్లు మారుతి, మల్లేశ్, గంగారెడ్డి, ఇసా, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ అపర్ణ, నాయకులు ఉమ్మాజి నరేశ్, చిన్న సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


