జొన్న సాగుపై ఆసక్తి
● కామారెడ్డి జిల్లాలో యాసంగిలో 72 వేల ఎకరాలలో సాగవుతుందని అంచనా
● మద్దతు ధర లభిస్తుండడంతో
పెరుగుతున్న సాగు విస్తీర్ణం
కామారెడ్డి క్రైం : జిల్లా రైతులు మూడేళ్ల క్రితం వరకు జొన్న సాగు చేయడానికి అంతగా ఆసక్తి చూపేవారు కాదు. తోటి రైతులు సాగు చేయకపోవడం, పక్షుల నుంచి పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి రావడం, ధర తక్కువగా ఉండడం వంటి కారణాలతో తక్కువ మంది రైతులు మాత్రమే ఈ పంట వేసేవారు. అయితే మూడేళ్లుగా పరిస్థితిలో మార్పు వస్తోంది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తుండడం, దిగుబడులు బాగుంటుండడంతో క్రమంగా రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో జొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోంది. నీటి వినియోగం అధికంగా ఉండే పంటల స్థానంలో జొన్న సాగు వైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
అంచనాలకు మించే అవకాశం..
గతంలో నీటి వనరులు తక్కువగా ఉన్న రైతులు మొక్కజొన్న, శనగ వంటి ఆరుతడి పంటలను ఎంచుకునేవారు. అయితే శనగ దిగుబడులు తక్కువగా వస్తుండడంతో రైతులు ఆ పంట సాగు తగ్గించారు. శనగ స్థానంలో జొన్నను ఎంచుకుంటున్నారు. అధి క దిగుబడులు వచ్చే వంగడాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండడం, నీరు తక్కువగా అవసరం ఉండడంతో ఈ పంట సాగుకే ఆసక్తి చూపుతున్నా రు. గతేడాది యాసంగి సీజన్‌లో 71,104 ఎకరాల్లో జొన్నసాగయ్యింది. జుక్కల్ నియోజకవర్గంతో పాటు గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట తదితర మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట పండించారు. ఈసారి 72,200 ఎకరా ల్లో జొన్న సాగవవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఈ సీజన్‌లో జొన్న పంట అంచనాలకు మించి సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు అంచనా వేసిన దానికంటే 20 శాతం ఎక్కువ విస్తీర్ణంలో జొన్న సాగయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
రెండు రకాలు..
జొన్న సాగు రెండు రకాలుగా ఉంటుంది. నీటి తడి అందించకుండా పండించే సాధారణ రకం జొన్నతోపాటు మూడు నుంచి నాలుగు తడులతో పండే నీళ్ల జొన్న రకాలున్నాయి. సాధారణ రకం 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు, నీటి తడులతో పండే జొన్న 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొనుగోలు కేంద్రాలతో ఊరట
గతంలో జొన్న కొనుగోలు కేంద్రాలు లేక రై తులు తమ దిగుబడిని దళారులకు విక్రయించాల్సి వచ్చేది. దీంతో సరైన ధర లభించక రై తులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపేవారు కా దు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆ ధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. గతేడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ. 3,371 గా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో గత యాసంగి వరకు ఎకరానికి 8.65 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేయాలనే పరిమితి ఉండేది. కానీ ఈ పరిమితి ని ప్రభుత్వం 14 క్వింటాళ్లకు పెంచింది. ఇది కూడా రైతులకు ఊరటనిస్తోంది. నీళ్ల జొన్న ది గుబడి 20 క్వింటాళ్లకు పైగా వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రైతులు కోరుతున్నారు.


