సేంద్రియ ఎరువుకు డిమాండ్
మోర్తాడ్(బాల్కొండ): పశు పేడ ధర భారీగా పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు సాగు చేసే వ్యవసాయ క్షేత్రాల్లో వేసవిలోనే ఆవు, గేదె, గొర్రె, మేక పేడను రైతులు విరివిగా వినియోగిస్తున్నారు. పసుపు తవ్వకాలతో సంబంధం లేకుండానే రైతులు ముందస్తుగా పశువుల పేడను తమ పంట పొలాల వద్ద నిలువ చేసుకుంటున్నారు. పశువుల పేడ లారీ లోడ్ ధర గతంలో రూ.16 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.23 వేల నుంచి రూ.25 వేలకు వరకు పెరిగింది. గొర్రెలు, మేకల పేడ ధర గతంలో రూ.26 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు ధర పలుకుతోంది. గత సీజన్‌లో పసుపు క్వింటాల్‌కు రూ.10 వేలకుపైగా ధర లభించడంతోనే సేంద్రియ ఎరువుల ధరలను విపరీతంగా పెంచారని రైతులు అంటున్నారు. పశు పేడను విక్రయించే యజమానులు నేరుగా విక్రయి స్తే ధర ఇలా ఉండదని, దళారుల జోక్యం కారణంగానే ధర భారీగా పెరిగిందని వాపోతున్నారు. పశు పేడకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికంగా పేడ లభించక దిగుబడి చేసుకుంటుండడంతో ధర పెరుగుతోందని అంటున్నారు.
వర్మికంపోస్టు వినియోగిస్తే..
వర్మి కంపోస్టు వినియోగిస్తే పశు పేడ ధర తగ్గుతుందని పలువురు అంటున్నారు. వర్మి కంపోస్టును గ్రామ పంచాయతీల ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించినా ఆశించిన స్థాయిలో ఉత్పత్తి సాగడం లేదు. ప్రైవేట్ కంపెనీలు విక్రయించే ఎరువు ధర కొంత ఎక్కువగానే ఉంది. పశువుల సంఖ్య మన ప్రాంతంలో పెరిగితే పేడ ధర అదుపులోకి వచ్చే అవకాశం ఉందని కూడా పలువురు అంటున్నారు. ఏది ఏమైనా పశు పేడ ధర పెరగడం వల్ల రైతులకు పెట్టుబడులు భారం అవుతున్నాయని చెప్పొచ్చు.
మోర్తాడ్‌లో సేంద్రియ ఎరువును నిలువ చేసుకుంటున్న రైతు
భారీగా పెరిగిన ధరలు
లారీ పేడ ధర రూ.16 వేల నుంచి
రూ.23 వేలకు..
దళారులే పెంచుతున్నారని
రైతుల ఆరోపణ
వర్మి కంపోస్టు వినియోగం
మేలంటున్న శాస్త్రవేత్తలు


