తుది జాబితా విడుదల
● నేడు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
● నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి
● డివిజన్లలో ఎన్నికల కోలాహలం
సుభాష్‌నగర్ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫొటో తుది ఓటరు జాబి తా, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. శనివారం డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఎ న్నికల కోలాహలం నెలకొనగా, ఇక ఎన్నికల షె డ్యూల్, నోటిఫికేషన్ వెలువడటమే మిగింది.
నిజామాబాద్‌లో 3.48 లక్షల ఓటర్లు..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. 488 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రానికి సుమారు 750 మంది ఓటర్లు ఉండేలా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగనున్న దృష్ట్యా దాదాపు వెయ్యికిపైనే బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా 2200 మంది (20 శాతం అదనం) పోలింగ్ సిబ్బంది అవసరముంటుంది. పీవో, వోపీవో, ఏపీవో, ఆర్‌వోలకు ఎన్నికల శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్‌శాఖ గుర్తించింది.
60 డివిజన్లకు..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 60 డివిజన్లకు శనివారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు 50 శాతం పరిమితి మించకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు (ఆయా సామాజిక వర్గాల నిష్పత్తుల ప్రకారం) రిజర్వేషన్లు కేటాయించనున్నారు.
ఆ మేరకు ఇప్పటికే రిజర్వేషన్లను ప్రకటించారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తారు. 60 డివిజన్లకుగాను 30 అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించగా, 24 బీసీలు, 5 ఎస్సీలు, 1 ఎస్టీకి కేటాయించారు. శనివారం ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో నిజామాబాద్ సహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల మహిళల రిజర్వేషన్లకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటమే మిగిలింది. ఇప్పటికే డివిజన్లలో ఎన్నికల కోలాహలం మొదలైంది. రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈనెల 19 లేదా 20 తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
పెరిగిన పోలింగ్ కేంద్రాలు..
ఎన్‌ఎంసీలో పెరిగిన జనాభాకనుగుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో 2.91లక్షల మంది ఓటర్లు ఉండగా, 413 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆరేళ్లలో సుమారు 57 వేల ఓట్లు పెరిగి 3.48 లక్షలకు చేరాయి. దీంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా 488కి పెరిగాయి. 2025 అక్టోబర్ 1కి ముందు ఓటరుగా నమోదు చేసుకున్న వారికే ఓటు వేసేందుకు కటాఫ్ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. కలెక్టర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్‌డీవో, నార్త్, సౌత్ తహసీల్ కార్యాలయాల్లో తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శించారు.


