ఇచ్చిన హామీలను అమలు చేయాలి
నిజామాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు వేతనం ఇస్తామని, ప్రతి నెలా బిల్లులు, వేతనాలు చెల్లిస్తామని, కార్మికులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ పథకాన్ని హరే రామ హరే కష్ణా అనే అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పజెప్పడం సరైంది కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కొడంగల్‌లో ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా రెండు నియోజకవర్గాలకు ఒక సెంటర్ పాయింట్ పెట్టి అక్కడ వంటలు చేయించి ప్రతి పాఠశాలకు భోజనాన్ని సరఫరా చేయడమంటే నాణ్యత లేనటువంటి భోజనం పెట్టడమే అని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి టీ చక్రపాణి గౌరవ అధ్యక్షురాలు సాయమ్మ, లలిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.


