సిబ్బంది సమయపాలన పాటించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● భీమ్‌గల్‌లోని కస్తూర్బాగాంధీ విద్యాలయం తనిఖీ
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): బోధన, బోధనేతర సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ, పక్కాగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. విద్యాలయం ప్రత్యేకాధికారినితో మాట్లాడి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాలయం ప్రహరీ తక్కువ ఎత్తులో ఉండడాన్ని గమనించిన కలెక్టర్, బాలికల భద్రత కోసం వెంటనే ప్రహరీ ఎత్తు పెంచాలని సూచించారు. అన్ని కేజీబీవీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. కస్తూర్బా పాఠశాల ప్రాంగణంలో కుక్కలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్‌ను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్ర మం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆ దేశించారు.ఆర్మూర్ సబ్‌కలెక్టర్‌అభిజ్ఞాన్‌మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్, డీఈవో అశోక్ తదితరులు ఉన్నారు.


