వెల్మల్ వీడీసీపై కేసు నమోదు
ఆర్మూర్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్యామ్ రాజ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో వీడీసీల ఆగడాలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవుతున్న నేపథ్యంలో వెల్మల్ వీడీసీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. వెల్మల్ గ్రామంలో చికెన్, వైన్స్ ఏర్పాటుకు వీడీసీ వేలంపాట నిర్వహిస్తున్న వీడియో ఆధారాలను గ్రామానికి చెందిన బోగ రాములు పోలీసులకు సమర్పించి ఫిర్యాదు చేశాడు. దీంతో వీడీసీ అధ్యక్షుడు పొలాస ముత్యంతోపాటు వీడీసీ ప్రతినిధులు బురిపెల్లి గంగాధర్, సగ్గం నారాయణ, శివసారి మురళి, చేపూరి యాదాగౌడ్‌తోపాటు వీడీసీకి సహకరిస్తున్న శేఖర్‌గౌడ్‌పై కేసులు నమోదు చేశామన్నారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో వేలంపాట నిర్వహించి సర్పంచ్‌గా ఒకే వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే బరిలో ఉంటాడంటూ నిబంధనను అమలు చేసిన ఇదే వీడీసీపై సైతం ఇదే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెలలో ఒక కేసు నమోదు చేశారు. దీంతో రెండు నెలల్లో వెల్మల్ వీడీసీపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిర్యాదుదారుడు వీడీసీ వారితో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


