ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి టీ.కే.శ్రీదేవితో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ మాట్లాడారు. తుది ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించి పరిశీలన, పరిష్కారం అనంతరం 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసే లోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, పి.శ్రావణి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


