ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
నిజామాబాద్ అర్బన్: అధికారులు అంకితభావంతో కృషి చేస్తూ నిజామాబాద్‌ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. రో డ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ రావు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన పలు వీడియోలను ప్రదర్శిస్తూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లాలో 2024 సంవత్సరంలో 856 ప్రమాదాలు చోటుచేసుకోగా 351 మంది మృతి చెందారని, 2025 నవంబర్ నెలాఖరు నాటికి 815 రోడ్డు ప్రమాదాల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడంతోనే ప్రమాదాల బారిన పడుతున్నారని స్పష్టం చేశఆరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో, సమష్టిగా కృషి చేయాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐ కిరణ్ కుమార్, హర్ష తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
రోడ్డు భద్రతా మాసోత్సవాలపై
అధికారులు, సిబ్బందికి అవగాహన


