అదుపుతప్పిన ద్విచక్రవాహనం
● ఒకరి దుర్మరణం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి శివారులో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాగి గ్రామానికి చెందిన ద్యానబోయిన కొనింటి నగేశ్(40) గాయత్రి కార్మాగారంలో గోడౌన్ ఇన్‌చార్జీగా పనిచేస్తున్నాడు. భార్య నీలిమా, కుమారుడు, కూతురుతో కలిసి పిట్లం మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్నారు. ఫ్యాక్టరీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన నగేశ్ మాగి గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి రాత్రి వరకు విందు పార్టీలో పాల్గొన్నాడు. అనంతరం ద్విచక్రవాహనంపై పిట్లంకు బయల్దేరాడు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న నగేశ్ మూలమలుపు వద్ద అదుపు తప్పి బైక్ పైనుంచి జారిపడ్డాడు. తల, ముఖానికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున ఘటనా స్థలం వద్ద ఉన్న బైక్‌ను గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహానికి పంచానామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.


