అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
● 14 తులాల బంగారం,
ఆరు కిలోల వెండి స్వాధీనం
● వివరాలు వెల్లడించిన
సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 21న బోధన్ పట్టణంలోని రెండు బంగారు షాపుల షెట్టర్లను ధ్వంసం చేసి 35 తులాల బంగారం, 14 కిలోల వెండి, రెండు మోటార్ సైకిళ్లను దొంగిలించారు. బోధన్ టౌన్‌లో కేసు నమోదు చేసుకొని, ఎస్‌హెచ్‌వో వెంకట్‌నారాయణ విచారణ చేపట్టారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రికి చెందిన లక్ష్మన్‌సింగ్, ప్రేమ్‌సింగ్, సాగర్‌సింగ్, మహమ్మద్‌షేక్ అనే వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 11న బోధన్‌లోని ఆచన్‌పల్లి బైపాస్ రోడ్డు వద్ద పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు పక్కన నిందితులు మద్యం తాగుతూ కనిపించారు. పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా, లక్ష్మన్‌సింగ్, ప్రేమ్‌సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ప్రస్తుతం సాగర్‌సింగ్, మహహ్మద్ షేక్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన నయీం, నదీం, లక్ష్మీకాంత్, సంతోష్‌లపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి మోటార్‌సైకిల్ , 14 తులాల బంగారం, ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దొంగల ముఠాపై రెంజల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహారాష్ట్ర ఉమర్‌కేడ్, కిన్వట్, నిర్మల్ జిల్లా కుభీర్, రుద్రూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇది వరకు కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకట్‌నారాయణ, ఎస్సై మనోజ్‌కుమార్, ఏఎస్సై బాబూరావు, సిబ్బంది రవి, మహేశ్, సాయికుమార్, అశోక్‌లను సీపీ అభినందించారు. సమావేశంలో బోధన్ ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.


