ఆర్మూర్‌లో దొంగల బీభత్సం
● ఐదు ఇళ్లతోపాటు ఆలయంలో చోరీ
● తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని గోల్‌బంగ్లా ప్రాంతంలో పాల గంగాధర్ ఇంటికి తాళం వేసి పక్కనే గల మరో పోర్షన్‌లో కుటుంబసభ్యులతో నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న గదికి గడియపెట్టిన దుండగులు, పక్కన తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో దాచిన 8 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి అపహరించారు. ఓటిగల్లీలో కిరాణా షాప్, కార్ఖాన, అంగన్‌వాడీ కేంద్రంతోపాటు మరో ఇంటి తాళాలు ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దుండగులకు ఏమీ లభించకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. నిజామాబాద్ రోడ్డులోని పెద్దమ్మ ఆలయం తాళాలను సైతం ధ్వంసం చేశారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, క్లూస్ టీం బృందం ఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు. కాగా, పెద్దమ్మ ఆలయంలో చోరీకి యత్నంచిన ఇద్దరి చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.
ఆర్మూర్‌లో దొంగల బీభత్సం


