నాణేల కోసం మంజీరలోకి దిగి ఒకరి మృతి
పిట్లం(జుక్కల్): నాణేల కోసం మంజీర నదిలోకి దిగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొల్లక్‌పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. బొల్లక్‌పల్లి గ్రామానికి చెందిన సాయిలు(42) శుక్రవారం మంజీర నదిలో నాణేల కోసం దిగి గల్లంతయ్యాడు. సాయిలు కోసం గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ బృందాలు మూడు రోజులుగా శ్రమించాయి. సోమవారం ఉదయం సాయిలు మృతదేహం నదిలో లభ్యమైంది. నాణేల కోసం మంజీర నదిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
బాన్సువాడ : బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన ఆశయ్య (35) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ నెల 8న కొల్లూర్ వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో రుక్మిణి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆశయ్యను హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆశయ్య సోమవారం మృతి చెందాడు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మాక్లూర్: ఒకరి మృతికి కారణమైన తాపీ మేస్త్రీ మన్నేం లక్ష్మన్‌రావును సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.మండలంలోని మెట్‌పల్లి గ్రా మంలో ఈ నెల 11న ఉదయం ఇద్దరు తాపీ మేస్త్రీల మధ్య మాటామాట పెరిగి ఘర్షణ పడగా లక్ష్మన్‌రావు తోటి కూలీగా పనిచేసే జలపతి రాజుని రాడ్‌తో కొట్టాడు. దీంతో రాజు తలకు బలమైన గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలిసిన లక్ష్మన్‌రావు పరారీలో ఉండగా, నార్త్‌జోన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్ గాలింపు చేపట్టారు. సోమవారం నిందితుడు లక్ష్మన్‌రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


