అగ్రిమెంట్ రద్దు చేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి
సుభాష్‌నగర్ : నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్‌లలో సీసీ, బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్స్, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో ఒప్పందం ఉన్నప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు. పనులు చేపట్టకపోతే అగ్రిమెంట్ రద్దు చేసుకుని సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. జోన్‌ల వారీగా మంజూరైన పనుల గురించి ప్రసా విస్తూ.. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు? ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ చేపట్టారు? తదితర వివరాలను ఆరా తీశారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో రాజీ పడొద్దని, కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే ధోరణిని అవలంబిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయా లని సూచించారు.
గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. విభాగాలుగా విభజించుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. మళ్లీ సమీక్ష జరిపే సమయానికి అన్ని పనులు ప్రారంభమై, స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ సహాయ కమిషనర్ రవీందర్ సాగర్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో రోడ్ల పనులపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అసహనం
ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో రాజీపడొద్దని సూచన
పనులపై కార్పొరేషన్‌లో సమీక్ష


