డీలర్లు ప్రభుత్వ విత్తనాలే అమ్మాలి
● విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
డొంకేశ్వర్: ప్రభుత్వానికి సంబంధించిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి డీలర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రయివేటు కంపెనీలకు సంబంధించిన విత్తనాలను ఆకర్షనీయమైన, మోసపూరిత ప్రకటనలతో అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని వాటిని డీలర్లు రైతులకు అమ్మకూడదన్నారు. ప్రభుత్వం రూపొందించిన విత్తనాలను రైతులకు ఇవ్వాలని, తద్వారా మంచి దిగుబడులు వస్తాయన్నారు. ప్రతీ డీలరు ప్రభుత్వ విత్తనాలను 20క్వింటాళ్లు అమ్మాలన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రైతులు కూడా ఆలోచించి ప్రభుత్వ విత్తనాలు కొనుగోలు చేసి సీడ్ కార్పొరేషన్‌ను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంచి విత్తనాలు కాకుండా నాణ్యత లేనివి ఇచ్చి రైతులను మోసగిస్తే డీలర్లనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రయివేటు విత్తన కంపెనీల పెత్తనం పెరిగిపోయిందని వారి నుంచి రైతులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డీఏవో వీరాస్వామి, ఏడీఏ సాయికృష్ణ, సీడ్స్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్, ఆర్‌ఎం రఘు పాల్గొన్నారు.


