రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ అమెచ్యూర్ అసోసియేషన్ తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 9న రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న పోటీలలో అండర్ 14, సీనియర్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈసందర్భంగ ఎంపికై న క్రీడాకారులను ప్రెసిడెంట్ బసవ శ్రీనివాస్ అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికవ్వాలని ఆకాంక్షించారు.
ఇందల్వాయి: ఎస్‌జీఎఫ్ అండర్ 17 బాలుర కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా జట్టు కెప్టెన్‌గా మండలంలోని సిర్నాపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి శ్రీనివాస్ ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు రాజకుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 8నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో జరుగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నారు. ఈసందర్భంగా విద్యార్థిని హెచ్‌ఎం శ్రీధర్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
ఆర్మూర్ టౌన్: ఇంటర్ బోర్డు రూపొందించిన నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ హెచ్చరించారు. ఆర్మూర్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సీవీ రామన్ జూనియర్ కళాశాల, సాయి వొకేషనల్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, బోధన, బోధనేతర సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం డీఐఈవో మాట్లాడుతూ.. బోర్డు ప్రకటించిన పరీక్ష ఫీజుకంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ నెలలోనే సిలబస్ పూర్తి చేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా బోధించాలన్నారు.


