● రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తే
కఠిన చర్యలు
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
● ఖానాపూర్‌లో రైస్‌మిల్లు తనిఖీ
డిచ్‌పల్లి : ధాన్యం బస్తాల అన్‌లోడింగ్‌లో జాప్యం చేస్తున్న రైస్‌మిల్లు నిర్వాహకులపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ధాన్యం సేకరణ, రైస్‌మిల్లులకు తరలింపు తదితర వివరాలను కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అయితే, దొడ్డు రకం ధాన్యాన్ని రైస్‌మిల్లుల వద్ద రోజుల తరబడి దించుకోవడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని కేంద్రం నిర్వాహకులతోపాటు స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని, లేని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఖానాపూర్‌లోని ఆర్‌కే రైస్‌మిల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రక్‌షీట్లను తెప్పించుకొని ధాన్యం అన్‌లోడింగ్ సకాలంలో చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పలు లారీలు రైస్‌మిల్ ఆవరణలో ధాన్యం బస్తాల లోడ్లతో నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, ఎన్ని రోజుల నుంచి ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని డ్రైవర్లను ప్రశ్నించారు. ఐదారు రోజు లుగా దించుకోవడం లేదని వారు కలెక్టర్‌కు తెలిపా రు. ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకొని, వెంటవెంటనే ట్రక్‌షీట్‌లు అందించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైస్‌మిల్ నిర్వాహకులను ప్రశ్నించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే అకా ల వర్షాలతో తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నా రు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్‌కు సంబంధించి సమగ్ర పరిశీలన చేసి, పూర్తి సమాచారం అందించాలని డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డిలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు.


