వందేమాతరం సామూహిక గేయాలాపన
నిజామాబాద్ అర్బన్: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో శుక్రవారం సామూహికంగా గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేమాతరం గేయం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని, దేశ చరిత్రలో ఈ గేయం విశేష ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


