
ఆర్టీసీ లక్కీడ్రా విజేతలకు చెక్కుల ప్రదానం
నిజామాబాద్ సిటీ: దసరా సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ వారు ‘లక్కీడ్రా’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వరకు ఆర్టీసీ లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులపై ప్రయాణించిన వారికి డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో సదరు ప్రయాణికులు తమ టికెట్ల వెనుకాల తమ ఫోన్ నంబర్లను రాసి, బస్టాండ్‌లోని లక్కీడ్రా పెట్టెలో వేశారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోగల ఆర్‌ఎం కార్యాలయంలో ఇటీవల డ్రా తీశారు. విజేతలకు శుక్రవారం ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి చెక్కులు అందించారు. మొదటి బహమతి కింద యస్.చంద్రయ్యకు రూ.25 వేలు, రెండో బహుమతి కింద షేక్ బాబర్‌కు రూ.15 వేలు, మూడో బహుమతి కింద రాంప్రసాద్‌కు రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పరమాత్మ, ఆనంద్ బాబు, డీఎం–1 ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.