
గాలికుంటు వ్యాధికి టీకాతో చెక్
● జిల్లాలో ప్రారంభమైన పశువులకు వ్యాక్సినేషన్
● ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు కొనసాగనున్న కార్యక్రమం
బోధన్‌రూరల్/ఆర్మూర్: పాడిరంగంలో అభివృద్ధి సాధించాలంటే పాడి పశువుల సంపూర్ణ ఆరోగ్యం అత్యంత కీలకమైనది. అలాంటిది పాడి పశువులకు గాలికుంటు వ్యాధి సోకితే తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సివస్తుంది. వ్యాధి సోకిన పశువులు నీరసించిపోవడంతోపాటు, పాలదిగుబడి తగ్గిపోతుంది. దీంతో ఈ వ్యాధిని నివారించడానికి గేదె, ఆవు జాతి పశువులకు ప్రతియేటా ఉచితంగా వ్యాధి నివారణ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఈనెల 15న ఈ టీకాల కార్యక్రమం ప్రారంభం కాగా, నవంబర్ 14 వరకు కొనసాగనుంది. జిల్లాలో మొత్తం 82 టీంలను ఏర్పాటు చేసి ప్రాంతాల వారీగా పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు.
జిల్లాలోని పశువులు ఇలా..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2019లో చేపట్టి పశు గణాంకాల ప్రకారం జిల్లాలో గేదె జాతి పశువులు 2లక్షల 6వేల 898 ఉండగా, గో జాతి (ఆవులు, ఎడ్లు) పశువులు 1లక్ష 1వెయ్యి 252గా ఉన్నాయి. ఇప్పటికే పోషణ కరువై పశువులు, జీవాల సంఖ్య సుమారు 20 శాతం వరకు తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి ప్రస్తుతం పశువులకు టీకాలు వేస్తూ విశేష కృషి చేస్తోంది. గాలికుంటు వ్యాధిని నివారించగలిగితే ప్రత్యక్షంగా పశువుకి వ్యాధి వల్ల కలిగే బాధ నుండి ఉపశమనంతో పాటు ఆ పశువు పైన ఆధారపడిన రైతుకి ఆర్థిక స్వావలంబన చేకూరనుంది.