
670 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
● కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు
కల్పించాలి
● కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
వర్ని: రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లావ్యాప్తంగా 670 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. మోస్రా, చందూర్, వర్ని మండల కేంద్రాల్లో శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే వెంటనే తూకం జరిపి నిర్ధేషిత రైస్ మిల్లులకు పంపిస్తామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, రైతులకు సంబంధిత రసీదు అందజేయాలని, క్రాప్ బుకింగ్ డేటాలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రాక్ సీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని దీని ద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి, శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే పూర్తిస్థాయి మద్దతు ధర పొందవచ్చునన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్ సింగ్, వర్ని ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా పాల్గొన్నారు.