
భారీ అక్రమాలు
రేషన్ కార్డుల్లో
నిజామాబాద్‌అర్బన్ : ప్రజాపాలన కింద నూతన రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే 3,83,384 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల్లో లక్షా 18 వేల మంది పేర్లు చేరాయి. ఇదిలా ఉండగా అనర్హులకు సైతం రేషన్ కార్డులు దక్కినట్లు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో కొందరు అధికారు లు, రెవెన్యూ సిబ్బంది భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లగా ఆయన అక్రమార్కుల జాబితాను జిల్లాకు పంపి విచారణ కోసం ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేయాలి. అదేవిధంగా రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి. ఈ ప్రక్రియ మూడు నెలల పాటు కొనసాగింది.
ఇదే అదునుగా భావించిన కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం అర్హత లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేశారని సమాచారం. నూతనంగా రేషన్ కార్డు పొందడం కోసం ఒక్కొ క్కరి వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ‘మీ సేవ’ కేంద్రాల నిర్వాహకులు ప్రధాన భూమిక పోషించారు. మీ సేవ కేంద్రాలకు వచ్చే అనర్హులైన దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పి వసూళ్లకు పాల్పడ్డారు. దరఖాస్తుదారులను తహసీల్ కార్యాలయా లకు తీసుకెళ్లి భరోసా ఇప్పించారు. ఈ క్రమంలో జరిపిన వసూళ్లలో రెవెన్యూ సిబ్బందికి వాటాలు పంచినట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సౌత్ మండ లం తహసీల్ కార్యాలయంలో అత్యధిక అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో పని చేసే ఉద్యోగి ఏకంగా 34 మంది నుంచి భారీ మొ త్తంలో డబ్బులు తీసుకున్నట్లు అధికారులు విచారణలో తేలింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో మూ డు మీ సేవా కేంద్రాలను, ధర్పల్లి, సిరికొండ, రెంజల్, ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లోని మీసే వ కేంద్రాలు అక్రమాలకు అడ్డాగా గుర్తించారు. వీటి పై విచారణ పూర్తయ్యింది. బాల్కొండ, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి మండల కేంద్రాల్లోని రెవెన్యూ సిబ్బంది భారీ మొత్తంలో వసూలు చేశారని తెలిసింది. ని జామాబాద్ అర్బన్‌లో బోగస్ రేషన్ కార్డుల జారీ ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కేంద్రంలో పని చేసే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏ కంగా రూ. 20 వేలు ఇచ్చి సౌత్ మండలంలో మూ డు రేషన్ కార్డులు పొందినట్లు తెలుస్తోంది. గాంధీచౌక్‌లోని వ్యాపార నిర్వాకుడు, వినాయక నగర్‌లో ని పెట్రోల్ బంక్ యజమాని, బోధన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ పాఠశాల యజమాని రేషన్ కార్డులు పొందినట్లు అధికారుల అధికారులు గుర్తించారు.
పది మండలాల్లో..
జిల్లాలోని పది మండలాల్లో 22 మంది రెవెన్యూ సిబ్బంది, అధికారులు రేషన్ కార్డుల జారీలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణ అధికారులు తేల్చారు. దరఖాస్తుదారుడు రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోగానే మండల కార్యాలయంలోని సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి. రేషన్ కార్డుకు అర్హతలు గుర్తించి కార్డు మంజూరు కోసం పౌరసరఫరాల శాఖకు సిఫార్సు చేయాలి. ఈ క్రమంలోనే రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ పేరిట దరఖాస్తుదారుడు అనర్హురుడు అయితే డబ్బులు వసూలు చేసి అర్హుడిగా సిఫార్సు చేశారు. ఇలా వందలాది మంది అనర్హులకు రేషన్ కార్డులు జారీ చేశారు. మండల కార్యాలయంలో పనిచేసే కొందరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మరికొందరు తహసీల్దారులు కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ పూర్తయ్యింది. అక్రమార్కులకు గుర్తించారు. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తున్నారు. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో రేషన్ కార్డుల జారీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించినా తగిన ఫలితం కనిపించడం లేదు. రేషన్ కార్డుల జారీలో కొన్ని మండలాల్లో అనర్హులను ఎంపిక చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది పేర్లు, ఎవరు ఎంతెంత వసూలు చేశారనే వివరాలతో కమిషనర్ జిల్లా అధికారులకు జాబితాను పంపినట్లు తెలుస్తోంది. విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు.
చర్యలు శూన్యం!
భారీ వసూళ్లు.. అనర్హులకు
రేషన్ కార్డుల జారీ
అక్రమార్కుల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది
‘మీసేవ’ కేంద్రాల నిర్వాహకుల
ప్రధాన భూమిక
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
కమిషనర్ ఆగ్రహం
విచారణ పూర్తి చేసిన జిల్లా అధికారులు