
క్షేత్రస్థాయి నుంచి జల్లెడ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ షురువైంది. ఈ పీఠాన్ని బీసీకి అప్పగిస్తారా.. ఓసీకి కేటాయిస్తారా అనే విషయమై కచ్చితమైన నిర్ణయానికి రాకపోయినప్పటికీ ఏఐసీసీ నుంచి వచ్చిన పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ప్రతి అంశాన్ని జల్లెడ పడుతున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి కచ్చితమైన అభిప్రాయాలను సేకరించేందుకు స్వయంగా ఆయా నియోజకవర్గాల్లోని బ్లాక్‌ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలను సాధారణంగానే నిర్వహిస్తుండగా, ఆయా నియోజకవర్గంలోని కీలక నేతల, సీనియర్ నాయకుల, బ్లాక్, మండలాల అధ్యక్షుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందుకు గాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత వివరాలు తీసుకుంటున్నారు. ఇందులో సామాజిక సమీకరణలను సైతం బేరీజు వేస్తున్నారు. అభిప్రాయ సేకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో పీఠం ఆశిస్తున్న నాయకులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పరిశీలకుడు వడపోత కార్యక్రమం నిర్వహిస్తుండడంతో ఆయా నియోజకవర్గాన్ని బట్టి ప్రాధాన్యతాక్రమాలు మారుతున్నాయి. దీంతో డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులు తమ సొంత నియోజకవర్గం నుంచి భారీగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశీలకుడికి తమ పేర్లు చెప్పాలంటూ శ్రేణులను కోరుతున్నారు. మరోవైపు ఐదేళ్ల ముందు నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికే డీసీసీ పీఠం అప్పగించేందుకు పార్టీ నిర్ణయించడంతో స్క్రూటినీలో కొందరి దరఖాస్తులు ఎగిరిపోనున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో ఈ డీసీసీ పీఠం విషయంలో ఎంపిక ఏవిధంగా ఉంటుందనే విషయమై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
● క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుడు మంగళవారం బోధన్ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని బ్లాకుల వారీగా సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, ఆయా మండలాల అధ్యక్షులతో వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఒక బీసీ నాయకుడికి, మరొక ఓసీ నాయకుడికి అక్కడి నాయకులు మొదటి, ద్వితీయ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అలేగే పరిశీలకుడు బుధవారం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు, అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఆర్మూర్‌లోని రెండు బ్లాకులకు సంబంధించి నందిపేట మండలం వెల్మల్‌లో, ఆర్మూర్‌లో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బాల్కొండ నియోజకవర్గంలో బ్లాకుల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. కీలకమైన ఈ సమావేశాల అనంతరం వ్యక్తిగత అభిప్రాయ సేకరణలో ఆయా నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఎలాంటి అభిప్రాయాలు చెబుతారనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఒకటో ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత
పకడ్బందీగా అభిప్రాయ సేకరణ చేస్తున్న ఏఐసీసీ పరిశీలకుడు
సెగ్మెంట్లవారీగా మారుతున్న
సమీకరణలపై విశ్లేషణ
గత ఐదేళ్ల కాలాన్ని కటాఫ్‌గా
పెట్టిన నాయకత్వం