
చెక్‌డ్యాం బ్యాక్ వాటర్‌తోనే ముప్పు!
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..
మోర్తాడ్(బాల్కొండ) : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నిర్దేశించిన వరద కాలువకు గండి ఏర్పడిన ఘటనపై ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి చేసింది. పెద్దవాగు ప్రవాహానికి అడ్డు లేకుండా వరద కాలువ నీటిని మళ్లించడానికి గాండ్లపేట్ వద్ద నిర్మించిన అక్విడెక్ట్‌ను నిర్మించారు. దీని సమీపంలోనే చెక్‌డ్యాం నిర్మించడం అందులో నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువకు ముప్పు ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు నిర్దారించారు. చెక్‌డ్యాం ఇటీవలే కొట్టుకపోయినా ఎంతో కాలం నీరు నిలచి ఉండటం వల్లనే వరద కాలువ కింది భాగంలోని మట్టి కరిగిపోయి ఇప్పుడు ముప్పు వాటిల్లిందని ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. వరద కాలువకు ఇటీవల గండి ఏర్పడి నీరు అంతా పెద్దవాగులో ప్రవహించిన విషయం విదితమే. దీనిపై ఎస్సారెస్పీ ఛీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, సెంట్రల్ డిజైనింగ్ ఛీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఛీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ గండిపడిన చోటును పరిశీలించారు. ఎంతో కాలం మనుగాల్సిన వరద కాలువకు గండి ఏర్పడిన అంశం, అందుకు గల కారణాలపై ప్రభుత్వానికి నివేదికను అందించినట్లు తెలిసింది. వరద కాలువ అక్విడెక్ట్‌కు 300ల మీటర్ల దూరంలోనే చెక్‌డ్యాంను నిర్మించడం ఎక్కువ మొత్తంలో నీరు నిలచి ఉండటం వల్లనే గండి ఏర్పడటానికి ప్రధాన కారణం అని అధికారులు గుర్తించారు. కనీసం కిలోమీటర్ దూరంలో చెక్‌డ్యాంను నిర్మించి ఉంటే బ్యాక్ వాటర్ దూరంలోనే ఆగిపోయేదని అధికారులు భావిస్తున్నారు. అక్విడెక్ట్‌కు సమీపంలో చెక్‌డ్యాం నిర్మించడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదని తెలిసింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే చెక్‌డ్యాం నిర్మించినా వరద కాలువను పర్యవేక్షిస్తున్నవారితో సంప్రదింపులు జరుపకపోవడం గమనించాల్సిన విషయం. వరద కాలువ కింది భాగంలోని మట్టి దశలవారిగా కొట్టుకపోయి ఒక్కసారి నీటి ప్రవాహం పెరగడంతో గండి పరిమాణం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా వరద కాలువకు గండి ఏర్పడటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోని మిగులు జలాలను గోదావరి నదిలోనే వదలాల్సి వస్తుంది. గండిని పూడ్చి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పకడ్బందీగా మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఇంజినీరింగ్ అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు. సిమెంట్ గోడ కింద మట్టి పూర్తిగా కొట్టుకపోవడం శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులపై అధ్యాయనం చేయడానికి సాంకేతిక నైపుణ్యంగల అధికారి ఒకరు ఒకటి రెండు రోజుల్లో గండి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారని తెలుస్తుంది.
వరద కాలువకు గండి ఏర్పడిన చోట మరమ్మత్తులు పూర్తి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం. గండి ఏర్పడటానికి ప్రధాన కార ణం గుర్తించారు. మరమ్మత్తులు చేసి ముందు ముందు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా ఉండటానికి పక్కా ప్రణాళికను సిద్దం చేస్తున్నాం.
– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ
ఇటీవల గాండ్లపేట్ వద్ద
వరద కాలువకు గండి
ఇంజినీరింగ్ అధికారుల బృందం విచారణ పూర్తి
మరమ్మతుల కోసం అంచనాలు తయారు చేస్తున్న అధికారులు

చెక్‌డ్యాం బ్యాక్ వాటర్‌తోనే ముప్పు!