
త్వరలో జీవాలకు నట్టల నివారణ మందులు
నెలాఖరుకు మందులు వస్తాయి
డొంకేశ్వర్(ఆర్మూర్): రెండేళ్ల క్రితం నిలిచిపోయిన జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ మళ్లీ ప్రారంభం కాబోతుంది. త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జిల్లాకు కావాల్సిన మందులు ఎన్నో పశుసంవర్ధక శాఖ అధికారులు రాష్ట్ర శాఖకు ఇండెంట్ పంపించారు. ఐదుగురు అధికారులతో కూడిన కమిటీ నాలుగు రకాల మందులను గుర్తించింది. అయితే, ప్రభుత్వం వీటిని ఈ నెలాఖరు నాటికి జిల్లాకు పంపనుంది.
జిల్లాలో 6లక్షలకు పైగా జీవాలు
జిల్లాలో మేకలు, గొర్రెలు కలిపి 6,02,703 ఉన్నాయి. ప్రధానంగా నట్టల వ్యాధితోపాటు బద్దె పురుగులు, కార్యపు జలగలు, బొంత పురుగుల వ్యాధులను సైతం అధికారులు గుర్తించారు. వీటికి కూడా మందులు వేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నట్టల నివారణ మందులు ఉచితంగా జిల్లాకు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు మందులు రాలేదు. ఏడాదిలో కనీసం మూడుసార్లు మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేయాలి. దీంతో జీవాల పెంపకందారులైన గొల్ల, కుర్మలు డబ్బులు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నారు. త్వరలో నట్టల నివారణ మందులు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గొల్ల, కుర్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మందులు జిల్లాకు చేరుకోనుండగా అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ప్రణాళిక తయారు చేస్తోంది. తేదీ ఖరారైన వెంటనే గ్రామాల వారీగా షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. అయితే, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం వాస్తవమే. నెలాఖరు నాటికి జిల్లాకు పంపుతామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తాం.
– రోహిత్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ఇండెంట్ పంపిన పశుసంవర్ధక శాఖ
నెలాఖరు నాటికి జిల్లాకు
మందుల సరఫరా
అక్టోబర్ మొదటి వారంలో
పంపిణీకి ఏర్పాట్లు