సిరికొండ: మండలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఛాయలు నేటికి కదలాడుతున్నాయి. 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మండలంలో విస్తృతంగా సాగినట్లు ఆనాటి పెద్ద మనుషులు చెబుతుంటారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అణభేరి ప్రభాకర్‌రావు నేతృత్వంలో అదే సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమృత్‌లాల్ శుక్లా, శివాయిపల్లెకు చెందిన బల్‌రాంలు ఇక్కడ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. రజాకార్ల ఆకృత్యాలకు వేదికగా మారుతోందని హోన్నాజీపేట్ గడిపై వీరి ముఠా దాడి చేసింది. దాడితో గడి దొర ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌కు పారిపోయాడు. ప్రభాకర్‌రావు బృందం మండలంలోని వివిధ గ్రామాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకొని భూస్వాముల చెరలో ఉన్న భూములను పేదలకు పంచిపెట్టారు. వీరి సారధ్యంలో ఉద్యమం నడుస్తుండగా రజాకార్లకు పన్నులు కట్టడం, పశువులు మేపుకున్నందుకు చెల్లించే పన్నులను చెల్లించడం మానివేశారు. అలాగే గడ్కోల్ గ్రామంలో దొరల వద్ద గుమాస్తాగా పని చేసే జంగం గంగన్నను ఉద్యమకారులు గ్రామ నడిబొడ్డున కాల్చి చంపారు.