
నిర్ణీత గడువులో దరఖాస్తులను పరిష్కరించాలి
● పరిశీలనలో జాప్యం చేయవద్దు
● అధికారులకు కలెక్టర్
వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
బోధన్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని, పరిశీలన ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సాలూర మండల తహసీల్దార్ ఆఫీస్‌ను మంగళవారం కలెక్టర్, సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ శశిభూషణ్‌ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. సాదాబైనామా, పీఓటీలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వెనువెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన జరపాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలిస్తూ అర్హులకు ఆమోదం తెలుపాలన్నారు. ఎస్‌ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ కోసం ముందస్తుగానే అవసరమైన జాబితాను సిద్ధ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహించేలా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్ అన్నారు.