
అద్భుతం అలీసాగర్
● తొమ్మిది దశాబ్దాల క్రితం నిర్మాణం
● నిజాం కాలంలో రూపకల్పన
చేసిన సీఈ నవాబ్ అలీ
● జిల్లా కేంద్రానికి తాగునీటి సరఫరా
నేడు ఇంజినీరింగ్స్ డే
బోధన్: నిజాం ఏడో రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన నాటి చీఫ్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో ఎత్తైన గుట్టల మధ్య అలీసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి డిజైన్ చేశారు. 93 ఏళ్ల క్రితం (1932లో) దీనిని నిర్మించగా ఆయన పేరు మీదుగానే అలీసాగర్ రిజర్వాయర్‌గా నామకరణం చేశారు. నవాబ్ అలీ ఇంజినీరింగ్ నైపుణ్యాలు, దార్శనికతతో రూపుదిద్దుకున్న రిజర్వాయర్‌తో బహుళ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు డి–46 కాలువ ద్వారా ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలల పరిధిలో 1500 ఎకరాలకు సాగు నీరందుతోంది. నిజామాబాద్ నగర ప్రజల తాగు అవసరాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజూ నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్ పక్కనే ఉన్న అలీసాగర్ ఉద్యానవనం జిల్లాలో ప్రముఖ్య పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. రిజర్వాయర్‌లో పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం కూడా ఉంది.